Sulochana Devi – Part 1
ఆకాశమంతా నల్లని మేఘాలు. దూరంగా మెరుపులు. చల్లని గాలి. ఒక విలాసవంతమైన కారు రోడ్డుపై నెమ్మదిగా వెళ్తోంది. ఆ కారులో కూర్చున్న వ్యక్తి ముఖంలో బాధ, కన్నీళ్లు. డబ్బు ఉంది... పేరు ఉంది... గౌరవం ఉంది... కానీ ఇల్లు లేదు. ఆ వ్యక్తి తనలో తాను అనుకున్నాడు.
"డబ్బుతో అందరికీ ఇల్లు కట్టించాను... కానీ నా కోసం ఒక గది కూడా మిగల్లేదు."
అతను ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించాడు. అనాథాశ్రమాలు కట్టించాడు. విద్యార్థులకు చదువు చెప్పించాడు. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేశాడు. తన పిల్లలు ఎప్పుడూ కష్టపడకూడదని కోట్ల రూపాయల ఆస్తి కూడబెట్టాడు.
కానీ...
ఆస్తి పంచే రోజు వచ్చింది.
అంతే.
కన్నబిడ్డలు ఆస్తి కోసం ఒకరితో ఒకరు గొడవపడ్డారు. చివరికి కలిసి ఒక్క సంతకంతో తమను పెంచి పెద్ద చేసిన కన్నతండ్రినే ఆయన సొంత ఇంటి నుంచే గెంటేశారు.
చివరికి...
తానే కట్టించిన ఇంటి గేటు బయట నిలబడ్డాడు. తలుపు మూసుకుంది,అతని జీవితంలో కూడా.
మనసు నిండా బాధతో, కళ్లలో కన్నీళ్లతో, ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియని దారిలో ఒంటరిగా సాగుతుండగా ఇంతలో,
ఎదురుగా ఒక బోర్డు.
"శ్మశానం"
లోపల ఒక చితి మండుతోంది.
అతను తెలియకుండానే లోపలికి నడిచాడు.
అక్కడ...
ఒక మనిషి నిశ్శబ్దంగా కట్టెలు సర్దుతున్నాడు. ముఖంలో ప్రశాంతత. కళ్లలో భయం లేదు. చేతుల్లో అలసట లేదు.
ఆ వ్యక్తి అడిగాడు.
"ఇక్కడే ఉంటావా?"
అతను చిరునవ్వు నవ్వాడు.
"అవును."
"భయం వేయదా?"
"బతికున్న వాళ్లను చూసి ఎక్కువ భయం వేసింది... చనిపోయిన వాళ్లను చూసి కాదు."
ధనవంతుడు ఆశ్చర్యంగా చూశాడు.
"నీ వాళ్లు?"
"లేరు."
"ఎప్పటి నుంచి?"
"పుట్టినప్పటి నుంచి."
కొద్దిసేపు మౌనం.
ఆ తర్వాత కాటి కాపరి నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు.
"ఒకరోజు... ఊరి చివర ఒక శవం పడింది. బంధువులు ఉన్నారు. కానీ కాటి కాపరి లేడు. చివరకు వాళ్లే ఏడుస్తూ దహనం చేశారు.
అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది.
నాకు ఇల్లు లేదు, కుటుంబం లేదు. అయితే... ప్రతి కుటుంబం చివరిసారి వచ్చే చోటు ఇదే. అప్పటి నుంచి... ఈ శ్మశానమే నా ఇల్లు."
ధనవంతుడు మౌనంగా విన్నాడు.
అంతలో...
దూరంగా ఎవరో నవ్వుతున్నారు అని ఇద్దరూ అతని వైపు తిరిగి చూశారు. అతడు చిందరవందరగా, పిచ్చివాడిలా కనిపించాడు. చేతిలో పాత పుస్తకం, కళ్లలో విచిత్రమైన వెలుగు. అతను ఒక్కసారిగా ఆకాశం వైపు చూసి అన్నాడు.
"చనిపోయిన వాళ్లు అదృష్టవంతులు..."
ఇద్దరూ అతని వైపు చూసి "ఎందుకు?" అన్నారు.
అతను నవ్వి "వాళ్లకు రేపటి గురించి ఆలోచన ఉండదు." అని చెప్పి నేల మీద కూర్చున్నాడు.
ధనవంతుడు నువ్వెవరు అని అడిగాడు.
అతను నవ్వుతూ ఊరంతా నన్ను పిచ్చోడు అంటుంది అన్నాడు
కాటి కాపరి "పిచ్చివాళ్లు ఇలా మాట్లాడరు." అన్నాడు.
అతను మెల్లిగా, ఒకప్పుడు నేను ప్రొఫెసర్‌ని. ఎన్నో డిగ్రీలు చదివాను. డబ్బు కన్నా జ్ఞానం గొప్పదని నమ్మాను.
ఒక రోజు... నా కుటుంబం మొత్తం నా కళ్లముందే ప్రమాదంలో చనిపోయింది. ఆ రోజు నుంచి.....
ప్రశ్నలు మాత్రమే మిగిలాయి...సమాధానాలు కాదు అని నవ్వేశాడు.
ఆ నవ్వు...
ఏడుపుకంటే బాధగా వినిపించింది.
ముగ్గురూ...
మండుతున్న చితిని చూస్తూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. అగ్ని ఒక్కో కట్టెను బూడిద చేస్తోంది. ఆ బూడిదను చూస్తూ కాటి కాపరి అన్నాడు...
"మనిషి జీవితంలో చివరి చిరునామా ఇదే... కానీ బ్రతికున్నప్పుడు మాత్రం శాశ్వతంగా ఇక్కడ ఉండబోతున్నట్టు జీవిస్తాడు."
ధనవంతుడు తల వంచాడు.
పిచ్చివాడని పిలిచే మేధావి మెల్లిగా నవ్వి,
"మనిషి పుట్టినప్పుడు చేతులు ఖాళీగా ఉంటాయి... చనిపోయేటప్పుడు కూడా చేతులు ఖాళీగానే ఉంటాయి... మధ్యలో 'నాది' అని చెప్పేది... అసలు ఎవరిది?"
ముగ్గురి మధ్య మొదలైంది కేవలం ఒక సంభాషణ కాదు...జీవితానికే అర్థం వెతికే ప్రయాణం.
ఒకడు సంపద కోల్పోయి వచ్చాడు.
మరొకడు బంధాలు లేక జీవించడం నేర్చుకున్నాడు.
ఇంకొకడు జ్ఞానం ఉన్నా, సమాధానాలు కోల్పోయాడు.
ఇంకా తెలుసుకోవాలంటే...
కథలు, కథా ఆలోచనలు కావాలా?
మీరు Movie Lover, Producer, Actor లేదా Director అయి, కొత్త కథలు, కథా ఆలోచనలు లేదా సినిమా కాన్సెప్ట్స్ కోసం చూస్తున్నట్లయితే, InkVerse Official ను సంప్రదించండి. మీకు నచ్చిన కథను సినిమా లేదా ఇతర క్రియేటివ్ ప్రాజెక్ట్‌గా మలచాలనే ఆసక్తి ఉంటే, మాతో సంప్రదించవచ్చు. మీ తదుపరి సినిమా కథ… ఇక్కడి నుంచే మొదలవచ్చు.
Disclaimer
ఈ కథ పూర్తిగా రచయిత సృజనాత్మక కల్పితం. ఇందులోని కథ, పాత్రలు, సంభాషణలు మరియు కథాంశాన్ని రచయిత అనుమతి లేకుండా పూర్తిగా లేదా పాక్షికంగా కాపీ చేయడం, పునఃప్రచురించడం లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం అనుమతించబడదు.
ఈ కథను మీకు నచ్చిన భాషలో చదవడానికి, బ్లాగ్‌లో అందుబాటులో ఉన్న Translator సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు. Read this story in your preferred language using the Translator available on our blog.
-InkVerse Official
Create. Write. Inspire

Comments
Post a Comment